: అది నితీష్ రక్తంలోనే ఉంది.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం: సుశీల్ కుమార్ మోదీ
మహాఘటబంధన్ కూటమికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముగింపు పలకడం ఆహ్వానించదగ్గ పరిణామమని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత నితీష్ రక్తంలోనే ఉందని, ఆ పార్టీతో కలసి ఆయన కొనసాగలేరని చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ, నితీష్ ల భాగస్వామ్యంతో అద్భుతాలు సృష్టిస్తామని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ కూటమి రాష్ట్రంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, మరుసటి రోజే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ పదవీబాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్బంగా సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, నితీష్ కు తాము మద్దతు ఇవ్వడం వెనుక ఎలాంటి కండిషన్లు లేవని చెప్పారు. బీహార్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని... బీహార్ కు గతంలో ఇచ్చిన హామీ కంటే ఎక్కువ మేలే జరగనుందని తెలిపారు.