: డార్క్‌నెట్‌ను కట్టడి చేయండి... అమెరికాకు తెలంగాణ ప్రభుత్వం వినతి
డ్రగ్స్ అమ్మకాలను కట్టడి చేసేందుకు డార్క్‌నెట్ వెబ్ సర్వర్లను నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం అమెరికాను కోరింది. స్థానిక ఎంబసీ, ఇంటర్‌పోల్ ద్వారా ఈ సమాచారాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. ప్రైవేట్ డ్రగ్ అమ్మకాలు ఎక్కువగా డార్క్‌నెట్ ద్వారానే జరుగుతున్నాయని, అందుకే సర్వర్లను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇటీవల అమెరికా, బ్యాంకాక్ దేశాల్లో జరుగుతున్న డ్రగ్ వ్యాపారాన్ని `ఆల్ఫాబే` అనే డార్క్ వెబ్‌సైట్‌ను నిషేధించడం ద్వారా ఎఫ్‌బీఐ కట్టడి చేసింది.
కానబీస్ గ్రోవర్స్ అండ్ మర్చంట్స్ కోఆపరేటివ్, హౌస్ ఆఫ్ లయన్స్ మార్కెట్, జియాన్ మార్కెట్, ది మేజెస్టిక్ గార్డెన్, గ్రీన్ స్ట్రీట్ వంటి చీకటి వెబ్‌సైట్ల ద్వారా హైద్రాబాద్ సిటీలో డ్రగ్స్ వ్యాపారం జోరుగా జరుగుతుందని డ్రగ్స్ వ్యవహారాన్ని విచారిస్తున్న ప్రత్యేక బృందం కనిపెట్టింది. ఈ వెబ్‌సైట్ల సర్వర్లన్నీ అమెరికా, లండన్ ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రత్యేక బృందం తెలుసుకుంది. వీటి సర్వర్లను మూసివేయడం వల్ల డ్రగ్స్ దందా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం. గంజాయి సరఫరా కూడా ఆన్‌లైన్ మార్కెట్ల ద్వారానే ఎక్కువగా జరుగుతుందని ప్రత్యేక విచారణ బృందం కనిపెట్టినట్లు తెలంగాణ సైబర్‌క్రైమ్ ప్రతినిధి తెలిపారు.