: భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించిన అమెరికా!
భారత్‌ను తమ ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించింది. అణుసరఫరాదార్ల బృందం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్- ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి తమ మద్దతు తెలియజేస్తున్న రిపోర్టును అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రవేశపెట్టింది. అలాగే ఆస్ట్రేలియా కూటమి, వాస్సెన్నార్ ఒప్పందాల్లో కూడా భారత సభ్యత్వానికి తాము మద్దతు తెలియజేస్తున్నట్లు రిపోర్ట్‌లో తెలియజేశారు. 2010 నుంచి వివిధ కూటముల్లో భారత్ సభ్యత్వానికి అమెరికా తన మద్దతు ప్రకటిస్తూనే ఉంది. అమెరికా నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టంలోని 1292వ సెక్షన్ ప్రకారం భారత్ - అమెరికాల మధ్య రక్షణ సంబంధ సహకార వృద్ధి జరుగుతుందని నివేదికలో ఉంది.
రక్షణ పరిజ్ఞానంలో భాగస్వామ్యం, ఆయుధాల ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య అవసరాలు వంటి విషయాల్లో ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగనుంది. అలాగే రక్షణ రంగంలో పరిశోధనకు కూడా ఇరుదేశాలు తమ ఆదాయంలో కొంత వెచ్చించాలని నిర్ణయించినట్లు నివేదిక తెలిపింది. అంతేకాకుండా రక్షణ విన్యాసాలు నిర్వహించడం, ఇంటర్నేషనల్ మిలటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా భారత మిలటరీకి అమెరికాలో శిక్షణ ఇప్పించడం వంటి సదుపాయాలు కల్పించినున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.