: అదే స్పీడు, అదే హుషారు.. సిట్ కార్యాలయానికి చేరుకున్న రవితేజ!
ప్రముఖ టాలీవుడ్ నటుడు, మాస్ మహరాజా రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణకుగాను ఆయన సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రవితేజ సిట్ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
విచారణలో ముఖ్యంగా కెల్విన్, జిశాన్ లతో ఉన్న సంబంధాలపైనే ప్రశ్నించనున్నట్టు సమాచారం. మరోవైపు దర్శకుడు పూరీ జగన్నాథ్ కు రవితేజ ఆప్తమిత్రుడు కావడంతో, డ్రగ్స్ వ్యవహారంలో వీరిద్దరి సంబంధాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. సిట్ కార్యాలయానికి బయల్దేరే ముందు కూడా రవితేజ తన లాయర్లతో కీలక చర్చలు జరిపారు. మరోవైపు, సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు నేటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది.