: వరకట్న వేధింపుల కేసులో ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్టులు వద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
వరకట్న వేధింపుల కేసులో బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్టులు చేయవద్దంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బాధిత భార్యల ఆరోపణలపై నిజానిజాలు నిర్ధారించుకోకుండా అరెస్టులు చేయవద్దని ఏకే గోయల్, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ (ఎఫ్‌డబ్ల్యూసీ)లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. వాటి ద్వారా ఫిర్యాదులోని నిజానిజాలను తేల్చాలని సూచించింది. పోలీసులు కానీ, మేజిస్ట్రేట్ కానీ తమ వద్దకు వరకట్న వేధింపుల కేసు వచ్చినట్టయితే వెంటనే అరెస్టులకు పోకుండా ఆ విషయాన్ని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, అప్పటి వరకు భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యలును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది.