: అప్పట్లో భారత్‌పై అణుదాడికి సిద్ధమైన ముషారఫ్.. అణువార్ హెడ్లు లేకపోవడంతో వెనక్కి తగ్గిన పాక్ మాజీ పాలకుడు!
భారత పార్లమెంటుపై పాక్ ముష్కరుల దాడి తర్వాత దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్‌పై యుద్ధం తథ్యం అన్నంత వరకు వెళ్లింది. దీంతో నాటి పాక్ సైనిక పాలకుడు ముషారఫ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. భారత్ నుంచి ఎదురయ్యే దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియని ముషారఫ్ ఎంతకైనా తెగించాలని నిర్ణయించుకున్నారు. అణుదాడికి కూడా సిద్ధమయ్యారట. జపాన్ పత్రిక ‘మైనిచి శింబున్’ ఈ విషయాన్ని బయటపెట్టింది.
అప్పట్లో భారత్‌పై అణ్వస్త్ర దాడి జరపాలని ముషారఫ్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొంది. అణ్వస్త్రాల ప్రయోగం విషయంలో గీసుకున్న గీతను చెరిపివేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ముషారఫ్ నిద్రలేని రాత్రులు గడిపినట్టు ఆయనను ఉటంకిస్తూ పేర్కొంది. అయితే అప్పట్లో భారత్, పాక్‌ల వద్ద అణువార్ హెడ్లు లేవని, దీంతో అణు బాంబు ప్రయోగానికి వాటిని సిద్ధం చేసేందుకు ఒకటి రెండు రోజులైనా పట్టేదని ఆయన చెప్పినట్టు తన కథనంలో పేర్కొంది. అణువార్‌హెడ్లను క్షిపణులకు అమర్చారా? అన్న ప్రశ్నకు లేదని, భారత్ కూడా ఆ పని చేయలేదని ముషారఫ్ చెప్పినట్టు తెలిపింది. అయితే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందన్న ఉద్దేశంతోనే ముషారఫ్ వెనక్కి తగ్గినట్టు పత్రిక తన కథనంలో అభిప్రాయపడింది.