: పూరీ డ్రగ్స్ వాడడం నేను చూడలేదు.. నేనైతే సిగరెట్, వైన్ తాగుతా.. ముమైత్ ఖాన్
డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఐటెం గాళ్ ముమైత్‌ఖాన్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్న ముమైత్ సిగరెట్, వైన్ తాగుతానని చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు, ఈ రోజుల్లో ఇది అత్యంత సాధారణమైన విషయమని పేర్కొంది. పూరీ జగన్నాథ్ డ్రగ్స్ వాడుతుండగా తాను చూడలేదని తెలిపింది. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగింది. పూరీతో కలిసి తానెప్పుడూ బ్యాంకాక్, గోవా వెళ్లలేదని, అతనితో సినిమా సంబంధాలు తప్ప ఇతరత్రా ఎటువంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. కెల్విన్, జీషన్, అలీలు ఎవరో తనకు తెలియదని చెప్పడంతో అధికారులు వెంటనే కెల్విన్ ఫోన్ కాల్ డేటాలో ఆమె నంబరును చూపించారు. అలాగే పూరీతో కలిసి పార్టీలో పాల్గొన్న కొన్ని వీడియోలను కూడా చూపించారు. అయితే ముమైత్ ఏమాత్రం తొణకలేదు. వారితో తనకు సంబంధాలు లేవని తేల్చి చెప్పింది.
అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి ముమైత్ దాదాపు తనకు తెలియదనే సమాధానాలు ఇచ్చింది. తనకు డ్రగ్స్ అలవాటు లేదన్న విషయం నిరూపించుకోవడానికే విచారణకు హాజరైనట్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం పుణె వెళ్లేందుకు ముమైత్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ కూడా మీడియా ఆమెను చుట్టేసింది. అక్కడ ఆమెను మీడియా వివిధ ప్రశ్నలు సంధించగా ‘ఎవ్రీ థింగ్ ఈజ్ ఫైన్’ అంటూ వెళ్లిపోయింది.