: కోహ్లీసేనకు బీసీసీఐ షాక్...ముందు మీ ఉద్యోగాలకు రాజీనామా చేయండి: ఆదేశం
టీమిండియాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ద్వంద్వ ప్రయోజనాలకు బీసీసీఐ వ్యతిరేకమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐలో ఏ, బీ, సీ గ్రేడ్ కాంట్రాక్టులతో ప్రయోజనం పొందుతున్న ఆటగాళ్లు, పలు సంస్థల్లో ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ద్వంద్వ ప్రయోజనం పొందుతున్నారు. విరాట్ కోహ్లీ ఓఎన్జీసీలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారాలు ప్రభుత్వ సంస్థల్లో వివిధ స్థాయి ఉద్యోగులుగా ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నిషేధిత నిబంధనల్లో ఆటగాళ్లు ఉండకూడదని చెబుతూ, పని చేస్తున్న సంస్థలకు రాజీనామా చేయాలని కోరుతూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉత్తర్వులు టీమిండియాకు మాత్రమేనా? మహిళా క్రికెట్ జట్టుకు కూడా వర్తిస్తుందా? అన్న దానిపై పూర్తి వివరాలు తెలియలేదు. మహిళా క్రికెటర్లలో కొందరు రైల్వేల్లో ఉద్యోగులుగా ఉన్నారు. మిధాలీ రాజ్ రైల్వే శాఖలో ఉద్యోగిణి అన్న సంగతి తెలిసిందే.