: ఆలూ చిప్స్ డబ్బాల్లో నల్లత్రాచుల స్మగ్లింగ్... వ్యక్తి అరెస్ట్
అరుదైన నల్లత్రాచు పాము పిల్లలతో పాటు మరికొన్ని ఇతర జంతువుల పిల్లల్ని ఆలూ చిప్స్ డబ్బాలలో పెట్టి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని అమెరికా కస్టమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన రోడ్రిగో ఫ్రాంకోకి హాంకాంగ్ నుంచి రెండు పార్శిళ్లు వచ్చాయి. అందులో ఒకదాన్ని తన ఇంటికి కస్టమ్స్ అధికారులు కొరియర్ చేశారు. ఈలోగా అతని పార్శిల్ చెక్ చేయాలని సెర్చ్ వారెంట్ రావడంతో రెండో దాన్ని చెక్ చేశారు. అందులో మూడు అరుదైన నల్లత్రాచు పాము పిల్లలను చూసి కస్టమ్స్ పోలీసులు కంగుతిన్నారు. ఇంతకు ముందు ఇంటికి పంపిన దాన్ని కూడా వెళ్లి చూస్తే అందులో రెండు తాబేలు పిల్లలు, రెండు మొసలి పిల్లలు కనిపించాయి. వీటిని హాంగ్‌కాంగ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి రోడ్రిగోను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇంతకు ముందు కూడా తనకు హాంగ్‌కాంగ్ నుంచి 20 నల్లత్రాచు పిల్లలు వచ్చాయని, కాకపోతే అవి దారిలో చనిపోవడంతో రక్షణ కోసం ఈసారి ఆలూ చిప్స్ డబ్బాల్లో పెట్టి పంపించారని రోడ్రిగో ఒప్పుకున్నాడు.