: మాంసాహార నిషేధ నిర్ణయం వల్ల లాభపడనున్న ఎయిరిండియా
దేశీయ విమానాల్లో ఎకానమీ తరగతిలో ప్రయాణించే వారికి మాంసాహార సరఫరాపై నిషేధం విధించడం వల్ల ఎయిరిండియా లాభపడనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఏడాదికి రూ. 8 - 10 కోట్ల వరకు పొదుపు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అలాగే ఆహార వృథా, శాకాహారం - మాంసాహారాలు కలిసిపోతాయేమోనని భయపడటం లాంటి సమస్యలు ఉండవని ఆయన వివరించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రయాణికుల అభిప్రాయం సేకరించారా? అని ప్రశ్నించగా వారిని సంప్రదించి, ఒప్పుకున్న తర్వాతే ఈ నిర్ణయం అమలు చేశామని జయంత్ సిన్హా చెప్పారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా సంస్థను కాపాడుకోవటానికి వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.