: మీడియా సొంతగా నిర్ణయించుకోవాలి...బొడ్డుపై కొబ్బరి కాయ వివాదంపై తాప్సీ పన్ను స్పందన
టాలీవుడ్ లో కలకలం రేపిన వివాదంపై తాప్సీ పన్ను స్పష్టమైన వివరణ ఇచ్చింది. తన తొలి సినిమాలో బొడ్డుపై దర్శకుడు కొబ్బరికాయ విసిరాడని, అందులో రొమాన్స్ ఏంటో తనకు అర్ధం కాలేదని ఒక షోలో తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ భగ్గుమంది. రాఘవేంద్రరావును విమర్శించేంత పెద్ద హీరోయిన్ వైపోయావా? అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చి, బాధపెట్టిన వారిని క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని పదేపదే ప్రసారం చేసిన మీడియా సంస్థలు, తన వివరణను ఒకే ఒక్కసారి ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా ఏం కోరుకుంటోందని ఆమె అడిగింది.
సమాజానికి మీడియా మంచి చేయాలనుకుంటున్నప్పుడు మంచిని ప్రసారం చేయాలని, అలా తాను క్షమాపణలు చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా, వివాదాన్ని పదేపదే ప్రసారం చేయడం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటుందో మీడియాయే నిర్ణయించుకోవాలని సూచించింది. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పానని తెలిపింది. తన అనుభవాలు చెబితే విమర్శలు చేశానంటూ వివాదం రేపుతారని, మౌనంగా మోడెస్ట్ గా ఉంటుందని విమర్శిస్తారని... ఎలా ఉంటే మీడియాకు ఇబ్బంది ఉండదని ఆమె నిలదీసింది. తానెందుకు అబద్దాలు చెప్పాలని ఆమె ప్రశ్నించింది. కాగా, త్వరలో ఆమె నటించిన 'ఆనందో బ్రహ్మ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.