: రిలయన్స్ వ్యాపారాన్ని చేజిక్కించుకున్న హెరిటేజ్... ప్రకటించిన బ్రాహ్మణి
హెరిటేజ్ కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ రిటైల్‌కు చెందిన డెయిరీ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ బ్రాహ్మణి తెలిపారు. 2022లోగా రూ. 6000 కోట్ల ఆదాయం సమకూర్చేలా కంపెనీ లక్ష్యాన్ని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం అవసరమైతే ఇతర కంపెనీలను కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే మొత్తం ఆదాయంలో వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల ఆదాయ వాటాను 24 నుంచి 40 శాతానికి పెంచే యోచనలో ఉన్నట్టు ఆమె అన్నారు. కంపెనీ లాభాల గురించి మాట్లాడుతూ - `గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,642.9 కోట్ల ఆదాయంపై రూ 66.8 కోట్ల నికర లాభాన్ని పొందామని, ప్రస్తుత కంపెనీ నికర విలువ రూ. 300 కోట్లుగా ఉందని, అలాగే గత నాలుగేళ్ల కాలంలో కంపెనీ వార్షిక సగటు ఆదాయ వృద్ధి రేటు 13.34 శాతంగా ఉన్నట్లు బ్రాహ్మణి వివరించారు.