: డ్రగ్స్ ను కూడా అమ్మించండి.. ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది: రామ్ గోపాల్ వర్మ ఫైర్
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నాడు. డ్రగ్స్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని వర్మ తప్పుబట్టాడు. సిగరెట్, ఆల్కహాల్ మాదిరిగానే డ్రగ్స్ అమ్మకాలను కూడా చట్టబద్ధం చేయాలని అన్నాడు. సిగరెట్, ఆల్కహాల్ అమ్మకాలను కేవలం ఆదాయం కోసమే ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని... ఈ నేపథ్యంలో, డ్రగ్స్ ను మాత్రం ప్రభుత్వం ఎందుకు చట్ట విరుద్ధంగా చూస్తోందని ప్రశ్నించాడు. డగ్స్ ను చట్టబద్ధం చేస్తే, ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని అన్నాడు. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా... విచ్చలవిడిగా అమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రజలను తాగుబోతులను చేస్తున్నది ఎక్సైజ్ శాఖ కాదా? అని ప్రశ్నించాడు. జనాల ఆరోగ్యాలను నాశనం చేస్తున్నది ఎక్సైజ్ డిపార్ట్ మెంటే అని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కోసం పాటు పడాల్సిన ప్రభుత్వం... మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుడటం ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమే అని ధ్వజమెత్తాడు.