: బీహార్ 'మహా ఘటబంధన్' చీలికపై మార్కెట్ ఇన్వెస్టర్ల త్రీ చీర్స్!
ఇండియాలో విపక్షాలు అనే మాట వినిపించకూడదన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ, తన లక్ష్యానికి మరో అడుగు దగ్గరైన వేళ, స్టాక్ మార్కెట్ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిన్న తొలిసారిగా 10 వేల పాయింట్ల స్థాయికి పైగా ముగింపును నమోదు చేసుకున్న నిఫ్టీ నేడు ఓ దశలో 10,100 పాయింట్లను దాటి ముందుకెళ్లింది. ఈ ఉదయం 1.15 గంటల సమయంలో సెన్సెక్స్ 167 పాయింట్ల లాభంతో 32,549 పాయింట్ల వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల వృద్ధితో 10,076 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. బీజేపీ విజయాన్ని మార్కెట్ వర్గాలు హర్షిస్తున్నాయని, ఆ ప్రభావం నూతన కొనుగోళ్లపై కనిపిస్తోందని మార్కెట్ పండితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు నేడు జూలై నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగింపు కావడం కూడా మార్కెట్ ను ముందుకు నడిపించిందని తెలిపారు. నేటి సెషన్ లో హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఏసీసీ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టీసీఎస్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.