: ఒక్క పూట తిండి కోసం డ్యాన్సర్ గా మారిన ముమైత్ ఖాన్... ఆమె జీవితంపై ఆసక్తికర విశేషాలు
ఇప్పుడు సినీ నటిగా, సెలబ్రిటీగా, ప్రేక్షకులకు పేరు వింటేనే గుర్తొచ్చే ముమైత్ ఖాన్, ఒకప్పుడు పూట తిండికి కూడా లేని దుర్భర పరిస్థితులను అనుభవించిందంటే నమ్మగలరా? ఆమె సినీ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? ఆమె జీవితంపై కొన్ని ఆసక్తికర విశేషాలివి.
ముమైత్ తల్లి పాకిస్థానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆపై కూతురు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్. పిల్లల పెంపకం భారం కాగా, తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు రూ. 1500 జీతానికి ఓ డ్యాన్స్ ట్రూప్ లో చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభ బయటపడింది. సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేసింది. ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే. ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది కూడా. పూరీ జగన్నాథ్ తీసిన 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అనే ఐటమ్ సాంగ్ ముమైత్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయగా, ఆపై ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి. ముక్కుసూటిగా మాట్లాడే తత్వమున్న ముమైత్ ఖాన్ ను ఇప్పుడు సిట్ అధికారులు విచారిస్తున్నారు.