: మహిళలకు ప్రత్యేకం.... విస్తారా ఎయిర్‌లైన్స్
ఢిల్లీకి చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ వారు మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని సేవలు ప్రకటించారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు తమ లగేజీ మోయడంలో సహాయపడటం, విమానం దిగిన దగ్గరి నుంచి ట్యాక్సీ వరకు ఒకరిని తోడుగా పంపడం, అలాగే ప్రత్యేకంగా వారు కోరుకున్న సీటును కేటాయించడం వంటి సేవలను అందజేయనుంది. మహిళలపై వేధింపులను తగ్గించడానికే ఈ సేవలను ప్రారంభించినట్లు, దేశంలో ఇలాంటి సేవలు ఏర్పాటు చేస్తున్న మొదటి విమానయాన సంస్థ తమదేనని విస్తారా ప్రతినిధి సంజీవ్ కపూర్ తెలిపారు. భారత్‌కు ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికులకు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మన దేశంలో లైంగిక వేధింపులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిస్తాయని, అలాంటి దుస్థితి నుంచి బయటపడటానికి ఇలాంటి సేవలు ఉపయోగపడతాయని సంజీవ్ వివరించారు.
ఇంటర్నేషనల్ విమెన్ ట్రావెల్ సెంటర్ మేగజైన్ నివేదిక ప్రకారం మహిళా ప్రయాణికులకు అతి ప్రమాదకర దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. స్థానిక మహిళలతో పోలిస్తే విదేశాల నుంచి వచ్చిన ఒంటరి మహిళలను వేధించేందుకే ఈ దేశాల పురుషులు మొగ్గుచూపుతారని మేగజైన్ నివేదిక తేల్చిచెప్పింది. త్వరలోనే మహిళల కోసం ప్రత్యేక సేవలను అంతర్జాతీయ ప్రయాణాల్లో కూడా విస్తారా ఎయిర్‌లైన్స్ అమలు చేయనుంది. వీరి సేవలను జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో కూడా అమలు చేయాలని మహిళా ప్రయాణికులు ఆశిస్తున్నారు.