: ఖతార్ కు అణ్వాయుధాలు ఇవ్వాలని కిమ్ జాంగ్ నిర్ణయం... అమెరికాకు షాక్!
రోజు రోజుకూ తన దేశంలోని అణుశక్తిని పెంచుకుంటూ పోతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, ఇప్పుడు అమెరికాకు మరిన్ని నిద్రలేని రాత్రులు మిగల్చాలని భావిస్తూ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఖతార్ కు, మిగతా అరబ్ దేశాలకు మధ్య విభేదాలు పెరిగిన వేళ, అమెరికాకు షాకిచ్చేలా కిమ్ నూతన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఖతార్ కు అణ్వాయుధాలు అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
యూఏఈలోని ఓ కంపెనీతో నార్త్ కొరియా 100 మిలియన్ డాలర్ల విలువైన డీల్ కుదుర్చుకుందని, ఖతార్ దేశం నార్త్ కొరియాతో ప్రమాదకరమైన బంధాన్ని పెంచుకుంటూందని దినపత్రిక 'ది హిల్' సంపాదకీయాన్ని రాసింది. ఈ విషయంలో 2015లోనే లీకులు వచ్చినప్పటికీ, అప్పట్లో విభేదాలు ఇంత పెద్ద ఎత్తున లేకపోవడంతో ప్రచారం సాగలేదని తెలుస్తోంది. యూఏఈ ప్రభుత్వ ఈమెయిల్స్ లో సైతం ఈ డీల్ పై కొంత సమాచారం అమెరికాకు వచ్చిందని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. వాషింగ్టన్ లో ఉన్న ఎమిరేట్స్ దౌత్యాధికారికి ఈ డీల్ పై మరిన్ని వివరాల కోసం అమెరికా సమన్లు కూడా జారీ చేసిందని తెలుస్తోంది.
కాగా, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన కార్మికుల సంఖ్య ఖతార్ లో 3 వేల వరకూ ఉంది. వీరంతా 2022లో వరల్డ్ కప్ పోటీలకు అవసరమైన వేదికలను నిర్మించే పనుల్లో ఉన్నారు. తాజా నార్త్ కొరియా, ఖతార్ సంబంధాలపై సౌదీ, అమెరికన్ పబ్లిక్ రిలేషన్స్ అఫైర్స్ కమిటీ ప్రతినిధి సల్మాన్ అల్ అన్సారీ తన అభిప్రాయాలను తెలుపుతూ, కిమ్ తో బంధం వల్ల ఖతార్ మరింత నష్టపోనుందని హెచ్చరించారు.