: ఇద్దరు 'చంద్రుల' మూడేళ్ల డిమాండ్ పై నీళ్లు చల్లిన కేంద్రం... నియోజకవర్గాల పెంపు లేనట్టే!
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేనట్టేనా? నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీతో ఇదే విషయమై చర్చించి బయటకు వచ్చిన తరువాత చెప్పిన మాటలను చూస్తే, నిజమేననిపిస్తోంది. రాష్ట్రాలు విడిపోయిన తరువాత, అటు తెలంగాణలో, ఇటు ఏపీలో అధికార పార్టీలోకి ఫిరాయింపుల జోరు కొనసాగిన సంగతి తెలిసిందే. అప్పటికే పార్టీని ఆశ్రయించుకుని ఉన్న వారి స్థానంలో కొత్త నేతలు వచ్చి చేరేసరికి, అసెంబ్లీలను పెంచుకోవడం ద్వారా లోటును భర్తీ చేసుకోవాలని, మరింత మందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వొచ్చని చంద్రబాబు, కేసీఆర్ లు భావించారు. కానీ, తాజా పరిణామాలు అందుకు అనుకూలంగా లేవని తెలుస్తోంది.
బుధవారం నాడు మోదీని కలసి వచ్చిన కేసీఆర్, "నియోజకవర్గాల పెంపు మాకు అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. మేం మాట్లాడుకున్న అంశాల్లో ఇది ఆరవది. కేంద్రం చొరవ తీసుకుని పెంచితే ఏపీతో పాటు మేమూ లాభపడతాం" అని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ వ్యాఖ్యలతో 2019 ఎన్నికల్లోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పెంపు ఉండదన్న విశ్లేషణలకు బలం చేకూరింది. వాస్తవానికి 2026 వరకూ ఏ రాష్ట్రంలోనూ నియోజకవర్గాల పునర్విభజన ఉండదని అటార్నీ జనరల్ ఎన్నడో అభిప్రాయాన్ని చెప్పారు. ఇది రాజ్యాంగ సవరణతో కూడుకున్న విషయం కావడం, తెలంగాణలో బీజేపీ సైతం ఈ నిర్ణయానికి అనుకూలంగా లేకపోవడంతో కేంద్రం తొలి నుంచి ఆసక్తిని చూపడం లేదు. అయితే, విభజన చట్టంలో ఉంది కాబట్టి, టీఎస్ లో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యను 119 నుంచి 153కి, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని మూడేళ్లుగా చంద్రబాబు, కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. తాజా పరిణామాలతో నియోజకవర్గాల పెంపు అటకెక్కినట్టేనని తెలుస్తోంది.