: మెత్తబడిన చైనా.. మోదీపై ప్రశంసలు.. అమెరికాపై ఆగ్రహం!
సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం ఉద్రక్తతల నేపథ్యంలో, భారత్ ను పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది. మాట వినకుంటే యుద్ధం కూడా తప్పకపోవచ్చని హెచ్చరించింది. అయినా, భారత్ ఏ మాత్రం తగ్గలేదు. 'దేనికైనా సై' అంటూ అంతే స్థాయిలో బదులిచ్చింది. మధ్యలో అమెరికా కూడా కల్పించుకుని, భారత్-చైనాల మధ్య యుద్ధం వస్తే తమ మద్దతు ఇండియాకే అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నిన్నటి దాకా కారు కూతలు కూసిన చైనా అధికార మీడియా హఠాత్తుగా బాణీ మార్చింది. భారత ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించింది. వాణజ్య రంగాన్ని మోదీ పరుగులు పెట్టిస్తున్నారంటూ పేర్కొన్న అక్కడి మీడియా... భారత ప్రభుత్వం అమలు చేస్తున్న బహిరంగ విదేశీ ఆర్థిక విధానాన్ని ప్రశంసించింది. విదేశీ పెట్టుబడులను భారత్ అత్యధిక స్థాయిలో ఆకర్షిస్తోందని... పెట్టుబడులకు దేశాన్ని అనుకూలంగా మార్చిందని కితాబిచ్చింది.
గత రెండేళ్లుగా విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గధామంలా మారిందని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ నాయకత్వంలో క్రియాశీల విదేశాంగ విధానం అమలవుతోందని కితాబిచ్చింది. భారత్-చైనాల మధ్య బహిరంగ వాణిజ్య విధానం, వాణిజ్య సహకారాన్ని పెంపొందిస్తే... ప్రపంచంలోని స్వీయ సంరక్షణ విధానాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడింది. అయితే, భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు అమెరికా యత్నిస్తోందని విమర్శించింది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక స్వీయ సంరక్షణ విధానాలకు అమెరికా శ్రీకారం చుట్టిందని మండిపడింది. ఈ మేరకు చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా కథనాన్ని ప్రచురించింది.