: ముగిసిన ఛార్మి విచారణ.. ఆరున్నర గంటలపాటు విచారణ
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ సినీ నటి ఛార్మిని నేడు సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడే ఆమె విచారణ ముగిసింది. ఆరున్నర గంటల పాటు ఆమె విచారణ కొనసాగింది. మహిళా అధికారులు ఆమెను విచారించారు. ఉదయం 10 గంటల నుంచి కొనసాగిన ఆమె విచారణ, సాయంత్రం 4.45 గంటలకు ముగిసింది. విచారణ సందర్భంగా ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ముగిసిన వెంటనే ఎవరితో మాట్లాడకుండా ఛార్మి తన వాహనంలో వెళ్లిపోయింది. అయితే, మీడియా వైపు చూస్తూ, ఓ చిరునవ్వును మాత్రం చిందించింది.
విచారణ సందర్భంగా ఛార్మి నుంచి ఎలాంటి రక్త, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకోనట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి శాంపిల్స్ తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వైద్య సిబ్బంది కూడా సిట్ కార్యాలయానికి ఈరోజు రాలేదు.