: రేప్ ఆరోపణలపై 'మాతృభూమి' చానల్ న్యూస్ ఎడిటర్ విష్ణుదాస్ అరెస్ట్
తన వద్ద పని చేస్తున్న ఉద్యోగినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ప్రముఖ మలయాళ న్యూస్ చానల్ 'మాతృభూమి' సీనియర్ న్యూస్ ఎడిటర్ అమాల్ విష్ణుదాస్ ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టుగా, యాంకర్ గా ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు, లైంగికంగా వేధించాడని ఉద్యోగిని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ స్పర్జన్ కుమార్ ధ్రువీకరించారు. విష్ణుదాస్ పై సెక్షన్ 376 (అత్యాచారం), 377 (అసహజ ప్రవర్తన), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు పెట్టినట్టు తెలిపారు.
కాగా, బాధితురాలి ఫిర్యాదులోని వివరాల మేరకు, తన మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉన్న వేళ, ఉద్యోగినితో పరిచయం పెంచుకున్న విష్ణుదాస్, విడాకుల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరచుకున్నాడు. తన తండ్రి వైద్య ఖర్చులకని చెప్పి పెద్ద మొత్తం డబ్బు కూడా తీసుకున్నాడు. ఆపై ఆయనకు విడాకులు మంజూరైన తరువాత, మొహం చాటేశాడు. ఎవరికైనా విషయం చెబితే, కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడు. కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.