: మా వాళ్ల జీవితాలే ఇంత!: వైవీఎస్ చౌదరి భావోద్వేగం


సినీ పరిశ్రమ యావత్తూ మత్తులో కూరుకుపోయిందని విమర్శలు వస్తున్న వేళ, దర్శకుడు వైవీఎస్ చౌదరి తన అభిమానులకు భావోద్వేగం నిండిన మాటలతో ఓ లేఖను రాస్తూ, తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినీ ప్రముఖులకూ వ్యక్తిగత జీవితాలు ఉంటాయని, వారిని అర్థం చేసుకోవాలని కోరాడు. సినిమా వాళ్ల జీవితాలు అద్దాలమేడ వంటిదని చెప్పుకొచ్చాడు. పరిశ్రమపై వస్తున్న వార్తలు, రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోరలా ఉండవచ్చని, ఎల్లుండికి అవి పాచిపోయి, సద్దికూడుగా మారి, అందరూ అశుద్ధమని భావించి, వదిలించుకుంటారని అన్నాడు.

సినిమా వాళ్లు అడుక్కున్నా, అడుక్కోకున్నా, కొంచెం చేసినా, ఎక్కువ చేసినా 'అతి'శయమే అవుతుందని, శుక్రవారం వస్తే, జీవన రేఖలు, సూత్రాలు, గమ్యాలు మారిపోతుంటాయని, సంవత్సరంలో 52 సార్లు మార్పు, చేర్పులు తమ జీవితంలో తప్పవని అన్నాడు. మంచీ - చెడు, గెలుపూ - ఓటమి, పొగడ్తలు - తిట్లు తమను వెంటాడే నీడ వంటి నేస్తాలని, కుట్రలు రచించి, ప్రదర్శించే కథానాయకులం, ప్రతినాయకులం తామని, దానధర్మాలు, త్యాగాలూ చేసే మానవతావాదులమని చెప్పాడు.

తాము అందరికీ కావాల్సిన వాళ్లమేనని, కానీ, తమ అవసరాలకు మాత్రం ఎవరికీ కానివాళ్లమైపోయామని బాధను వ్యక్తం చేసిన వైవీఎస్ చౌదరి, ప్రసార మాధ్యమాలకు తాము కావాలని అన్నాడు. సముద్రపు అలలతో సినిమా సెలబ్రిటీలను పోలుస్తూ, పడినా, తిరిగి లేవగల సత్తా, ధైర్యం తమకున్నాయని, దేన్నైనా భరించే శక్తి, వెనుకాడని దమ్ము తమ సొంతమని అన్నాడు. ప్రపంచం వర్తమానంలోనే బతుకుతుందని, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపిక, భవిష్యత్తు గురించి బెంగ ఎవరికీ ఉండవని, కాల ప్రవాహంలో వెండితెరపై కమ్మిన కారుమబ్బులు తొలగుతాయని ఆశిస్తున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News