: తొలి రెండు గంటల విచారణలో చార్మీని అడిగిన ప్రశ్నలివే!
డ్రగ్స్ కేసులో భాగంగా హీరోయిన్ చార్మీ నేడు విచారణకు హాజరు కాగా, తొలి రెండు గంటల సమయంలో ఆమెను కాల్విన్ తో సంబంధాలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత నేతృత్వంలోని సీఐలు జయలక్ష్మి, రేణుక, శ్రీలతలు చార్మిని విచారిస్తుండగా, ఆమె ముక్తసరిగా చెబుతున్న సమాధానాలను బయటి నుంచి సిట్ ఉన్నతాధికారులు పరిశీలిస్తూ, అనుబంధ ప్రశ్నలను మహిళా అధికారులకు పంపుతున్నారు.
కాల్విన్ మీకు ఎలా పరిచయమని అడుగగా, ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసునని చార్మీ చెప్పినట్టు సమాచారం. జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్ లో భాగంగా అతను తెలుసునని, ఆపై ఇంకెప్పుడూ కలవలేదని చార్మీ వెల్లడించగా, ఆ తరువాత కూడా మాట్లాడినట్టు, చాటింగ్ చేసినట్టు తమ వద్ద సాక్ష్యాలున్నాయని విచారణ అధికారులు చెప్పినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వాటినే సాక్ష్యాలుగా చార్మి ముందు పెడుతూ, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం.