: యంగ్ హీరోలపై నిప్పులు చెరిగిన దర్శకుడు రేలంగి!
తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఇండస్ట్రీ నుంచి సరైన గౌరవం లభించలేదని దర్శకుడు రేలంగి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి చనిపోయినప్పుడు అమెరికాలో జరుగుతున్న తానా ఉత్సవాల్లో ఉన్న రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజలు స్పందించారని ఆయన చెప్పారు. చిరంజీవి, అల్లు అరవింద్ లు దేశంలో లేరని తెలిపారు.
కానీ, హైదరాబాదులోనే ఉన్న యంగ్ హీరోలు మాత్రం దాసరి చివరి చూపుకు రాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలోనే ఉండి, దాసరిని కడసారి చూసేందుకు రాని యంగ్ హీరోలను క్షమించరాదని ఆయన అన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు చనిపోతే, వచ్చి చూడాలన్న కనీస బాధ్యత కూడా వీరికి లేదా? అని మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, యంగ్ హీరోలపై ఈ మేరకు నిప్పులు చెరిగారు.