: బిర్యానిలో బల్లి... రైల్వే మంత్రికి ట్వీట్!
రైళ్లలో సరఫరా చేసే ఆహారం మనుషులు తినేందుకు పనికి రాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బృందం చెప్పి వారం రోజులు కూడా కాకముందే ఆ మాటలకు రుజువు దొరికింది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న పుర్వా ఎక్స్‌ప్రెస్ రైల్లో సరఫరా చేసిన ఆహారంలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ బిర్యాని తిన్న ప్రయాణీకుడు అస్వస్థతకు గురైనా రైల్వే సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆ బల్లి ఉన్న బిర్యాని ఫొటోను సరాసరి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా పంపించాడు.
బీహార్‌లోని పాట్నా స్టేషన్ కు దగ్గరలో ఉన్నపుడు ప్రయాణికుడు ట్వీట్ చేస్తే ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్ స్టేషన్ వచ్చే సరికి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడి ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యమంటూ అతనికి వైద్య పరీక్షలు చేశారు. ఇలా జరగడానికి కారణమైన వాళ్లపై చర్య తీసుకుంటామని మొఘల్‌సరాయ్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ తెలిపారు. అలాగే కాగ్ చెప్పిన విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన ఆహారం అందజేసేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.