: ఎదురుదాడికి దిగిన టాలీవుడ్... డ్రగ్స్ ను సినీ పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం సరికాదు: శివాజీ రాజా
ఎవరో పది మంది చేసిన తప్పుకు సినీ పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం సరికాదని టాలీవుడ్ చెబుతోంది. డ్రగ్స్ వినియోగంపై ఆరోపణలు వచ్చిన నాటి నుంచి ఇందులో భాగమయ్యారంటూ టాలీవుడ్ నటులపై పలు కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. దీంతో తొలుత సిట్ కు పూర్తిగా సహకరిస్తామని చెప్పిన టాలీవుడ్ నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటోంది. విచారణలో సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు వెలుగు చూశాయని ప్రటించిన సిట్ పలువురి పేర్లు ప్రకటించింది. ఇంతవరకు అంతా సజావుగానే సాగింది.
తొలుత పూరీ జగన్నాథ్ ను విచారించిన అనంతరం డ్రగ్స్ దందా మొత్తం మలుపులు తిరగడం ప్రారంభించింది. డ్రగ్స్ తీసుకున్నారో? లేదో? నిరూపించేందుకు పూరీ నుంచి కాలి, చేతి వేలి గోళ్లు, తల వెంట్రుకలు సేకరించడంతో వ్యూహం మారిపోయింది. సిట్ తొలుత చెప్పినట్టే విచారణ క్రమం సాగిస్తున్నప్పటికీ ఒకరి తరువాత ఒకరిని విచారిస్తున్న సమయంలో పరిశ్రమలోని మరికొందరి పేర్లు బయటపడుతున్నాయంటూ వెలువడుతున్న కథనాలు టాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
ఈ క్రమంలో సిట్ విచారణతో టాలీవుడ్ పరువు, ప్రతిష్టలు మంటగలిశాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ, ఆర్.నారాయణ మూర్తి తదితరులు సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ ఉన్నాయా? సినీ పరిశ్రమలోని వారే విచారణకు దొరికారా? అంటూ సిట్ పై ఎదురుదాడికి దిగారు. వర్మ మరికాస్త ముందడుగు వేసి...ఎక్సైజ్ డైరెక్టర్ బాహుబలిలా, సినీ పరిశ్రమలోని వారు విలన్లులా భావిస్తున్నారని పలు ట్వీట్లు సంధించారు. ఈ క్రమంలో శివాజీ రాజా పది మందిని పట్టుకుని సినీ పరిశ్రమను బ్లేమ్ చేయడం మంచిదికాదని చెప్పారు. మీడియా సంయమనం పాటించాలని సూచించారు. ఇక సినీ పరిశ్రమలోని డ్రగ్స్ వినియోగంపై వ్యతిరేకంగా పోస్టు చేస్తే వారిపై ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆరోపణలు ఉన్నవారు ఎలాంటి తప్పు చేయలేదని, ఆరోపించినవారే తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.