: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మిశ్రా!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆగస్టు 27తో తన పదవీ కాలం ముగియనుండటంతో జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తర్వాత ఆ స్థానంలో జస్టిస్ దీపక్ మిశ్రా పేరును అధికారికంగా సిఫారసు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా 14 నెలల పాటు అంటే అక్టోబర్ 2, 2018 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. గతేడాది సినిమా థియేటర్లలో సినిమాకు ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ మిశ్రా ఉన్నారు.
అలాగే పదోన్నతులలో రిజర్వేషన్లు, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మీమన్ కేసు, నిర్భయ రేప్ కేసుల్లో తీర్పునిచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ మిశ్రా పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎక్కువ అనుభవం గల జస్టిస్ మిశ్రా అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఎన్నో ప్రతిష్ఠాత్మక తీర్పుల్లో తన వంతు కృషి చేశారు.