: తమిళనాడు అధికారిక వెబ్సైట్లో మంత్రుల వివరాలు మాయం... కారణం కమలహాసన్?
తమిళనాడు రాష్ట్ర అధికారిక వెబ్సైట్లలో సంబంధిత శాఖల మంత్రులకు చెందిన ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తదితర వివరాలన్నీ మాయమయ్యాయి. గతంలో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి సంబంధిత మంత్రులకు ఈ-మెయిల్ చెయ్యండని నటుడు కమలహాసన్ ఇచ్చిన పిలుపే ఇలా జరగడానికి కారణమని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదు చేయాలంటే ఈ-మెయిల్ ఐడీ తెలియకుండా ఉండటం కోసం ఉద్దేశపూర్వకంగానే అధికారిక వెబ్సైట్ల నుంచి మంత్రుల వివరాలను తొలగించారని కమలహాసన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల నిజంగా సమస్య వచ్చిన వాళ్లు ఎలా చెప్పగలుగుతారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధికార పక్షం అన్నాడీఎంకే నేతలు, `మంత్రుల వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీ లేకపోతే ఏమవుతుంది? అసెంబ్లీ వెబ్సైట్లో వారి అధికారిక మెయిల్ ఐడీలు ఉన్నాయి కదా! అదీ కుదరకపోతే ప్రతి మంత్రికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంది, వాటిలో మీరు రిపోర్టు చేయొచ్చు` అని సమాధానమిచ్చారు.