: మాటల్లో పడి అమిత్ షాను పట్టించుకోని కేసీఆర్.. అందరికన్నా ముందే వచ్చినా వెనకే ఉండిపోయిన మమతా బెనర్జీ!
భారత 14వ రాష్ట్రపతిగా నిన్న రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ, పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అమిత్ షా విష్ చేసినా తొలుత పట్టించుకోలేదని తెలుస్తోంది. హాల్ లోపలికి వచ్చిన కేసీఆర్, తన వద్దకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాగంటి మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, సీతారామలక్ష్మిలను పలకరించిన తరువాత తమిళనాడు సీఎం పళనిస్వామి పక్కన కూర్చుని ముచ్చట పెట్టుకున్నారు. ఆ సమయంలో లోపలికి వచ్చిన అమిత్ షా, అందరినీ పలకరిస్తూ, కేసీఆర్ వద్దకు వచ్చి మాట్లాడబోగా, ఆయన పళని స్వామితో మాట్లాడుతుండడం వల్ల అమిత్ షాను చూడలేదు. ఆపై కార్యక్రమం ప్రారంభమైన తరువాత అమిత్ షా ముందు వరుసలో కూర్చుని ఉండగా, వెనుక వరుసలో కూర్చున్న కేసీఆర్, అమిత్ ను భుజం తట్టి పిలిచి నమస్కరించారు.
ఇక ఇదే కార్యక్రమానికి మిగతా సీఎంలతో పోలిస్తే, ముందుగానే వచ్చిన మమతా బెనర్జీ, ప్రొటోకాల్ ను పట్టించుకోకుండా, చివరి వరుసలో తన పార్టీ ఎంపీలతో కలసి కూర్చుండి పోయారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తదితరులతో పాటు మమతా బెనర్జీకి కూడా ముందు వరుసలో సీటు కేటాయించినప్పటికీ, ఆమె వెనకాలే కూర్చుండిపోయి తనదైన ప్రత్యేకతను చూపించారు. ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలసి కేజ్రీవాల్ వచ్చిన వేళ, తన ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ను వారి దగ్గరికి పంపిన మమతా బెనర్జీ, వారిని తన వద్దకు ఆహ్వానించారు. దీంతో కేజ్రీవాల్ మమతా బెనర్జీ పక్క సీటులో ఆశీనులై కార్యక్రమాన్ని తిలకించడం కనిపించింది.