: పెట్రోలు కావాలా? చలో కర్ణాటక!
చిత్తూరు జిల్లా పలమనేరు కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు వరకూ సరిహద్దుల్లో ఉన్న దాదాపు 200కు పైగా మండలాలు, గ్రామాల ప్రజలు పెట్రోలు, డీజిల్ కావాలంటే కర్ణాటక వెళుతున్నారు. దీనికి కారణం, ఏపీలో పెట్రోలు లీటరు ధర రూ.71కి అటూ ఇటుగా ఉండగా, కర్ణాటకలో రూ.64 మాత్రమే. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.62.50 వరకూ ఉండగా, కర్ణాటకలో రూ. 56 మాత్రమే. సుమారు 6 నుంచి 7 రూపాయల వరకూ తక్కువ ధరలకు పెట్రో ఉత్పత్తులు లభిస్తుండటంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు కర్ణాటకపై ఆధారపడుతున్నారు. ఏపీలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై రాజధాని నిర్మాణం పేరిట ఉన్న పన్నులకు అదనంగా అమరావతి సెస్ ను విధిస్తున్నందున ధరలు పెరిగాయి. ఇక సరిహద్దుల్లోని సగానికి పైగా పల్లెలకు, మండల కేంద్రాలతో పోలిస్తే, కర్ణాటక సరిహద్దులే దగ్గరగా ఉన్నాయి.
దీంతో తమ ప్రాంతంలో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసే బదులు, పక్క రాష్ట్రానికి వెళ్లి, నెలకు సరిపడా తెచ్చుకుంటే కొంత డబ్బు మిగులుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకు ఫలితంగా ఏపీ పెట్రోలు బంకుల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. పలమనేరు నియోజకవర్గానికి వస్తే, సగటున 80 వేల లీటర్ల వరకూ జరిగే విక్రయాలు, ధరా వ్యత్యాసం పెరగడంతో ప్రస్తుతం 40 వేల లీటర్ల అమ్మకాలే సాగుతుండటం గమనార్హం. ఇక తమ అమ్మకాలు పెంచుకునేందుకు సరిహద్దుల్లోని నంగిళి, ముళభాగిలు, వీ కోట సరిహద్దులు, రాజుపల్లి, తిమ్మరాజుపల్లి తదితర ప్రాంతాల్లో కర్ణాటక పెట్రోలు బంకు ఎంత దూరంలో ఉందన్న బోర్డులు పెట్టి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్న పరిస్థితి.