: నా న్యాయవాది మాటలకు, నాకు సంబంధం లేదు: కేజ్రీవాల్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రామ్ జెఠ్మలానీ మాట్లాడిన మాటలకు, తనకు ఏ సంబంధం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవి తాను చెబితేనే న్యాయవాది అన్నారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ మేరకు లిఖిత పూర్వక ఆధారం కూడా రామ్ జెఠ్మలానీకి పంపినట్లు కేజ్రీవాల్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు అరుణ్ జైట్లీ నిధులు దుర్వినియోగం చేశాడని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై జైట్లీ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ జరుగుతుండగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రామ్ జెఠ్మలానీ, జైట్లీని అసభ్య పదజాలంతో సంబోధించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జైట్లీ ఆ మాటలు కేజ్రీవాల్ చెబితేనే న్యాయవాది అన్నాడని ఆరోపిస్తూ మరో రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.