: పాఠశాల పుస్తకాల నుంచి ఠాగూర్ పాఠాలు తీసేసే ఆలోచనే లేదు: ప్రకాశ్ జవదేకర్
పాఠశాల పుస్తకాల్లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠాలను తొలగించే ఆలోచన తమకు లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ సమయంలో తృణమూల్ నేత డెరెక్ ఓ బ్రెన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఏవైనా సవరణలు ఉంటే తెలియజేయాలని ఉపాధ్యాయులు, వక్తలకు తాము విన్నవించుకున్నట్టు జవదేకర్ చెప్పారు.
అందులో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్ వారు పాఠశాల పుస్తకాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠాలను తొలగించాలని ఇచ్చిన సలహాపై మంత్రిత్వ శాఖ సమాధానం ఏంటని డెరెక్ ప్రశ్నించారు. అందుకు జవదేకర్ తమకు 7000లకు పైగా సలహాలు, సూచనలు వచ్చినట్లు, వాటిలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఏ సలహాను తాము అమలు చేయబోమని వివరించారు. అలాగే కొన్ని ఉర్దూ పదాలను తొలగించాలని, మీర్జా గాలిబ్ పాఠాలను కూడా ఎత్తివేయాలని సలహాలు వచ్చాయని, వాటిని కూడా తాము పరిగణనలోకి తీసుకోమని హామీ ఇచ్చారు.