: భారత్ కు ఎవరి సాయం అక్కర్లేదు... అయినా యుద్ధం వస్తే...అమెరికా భారత్ వైపే!: అమెరికా రక్షణ శాఖ మాజీ ఉద్యోగి
చైనాతో నెలకొన్న వివాదాన్ని భారత్ పరిష్కరించుకోగలదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో పెంటగాన్ లో పని చేసిన కీలక అధికారి తెలిపారు. అమెరికా, భారత్ మధ్య బంధం చాలా దృఢంగా వుందని ఆయన తెలిపారు. దానికి నిదర్శనం భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించిన విధానమని ఆయన చెప్పారు. భారత్ కు ఎవరి సాయమూ అవసరమవుతుందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు తీసిపోని విధంగా భారత్ వృద్ధి సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ పరంగా భారత్ సాధిస్తున్న విజయాలు చైనా కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయని, అందుకే భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
అయితే భారత్ ఏ విషయంలోనూ చైనాకు తీసిపోదని ఆయన తెలిపారు. దక్షిణాసియాలో చైనాతో తలపడి ఎదుర్కోగల శక్తి ఒక్క భారత్ కు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం అనివార్యమైన పక్షంలో అమెరికా, భారత్ పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు. అయితే భారత్ కు ఒకరిసాయం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు భారత్ ను చైనా ఇబ్బంది పెడుతుండగా, పాకిస్తాన్ కూడా చైనా సరసన చేరి భారత్ ను దెబ్బతీసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. అయితే పాక్ కల ఫలించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.