: వైట్ హౌస్ లో పెంపుడు జంతువుకు ఇంకా చోటివ్వని ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంప్రదాయాన్నీ పక్కన పెట్టేస్తున్నారు. అమెరికా అధ్యక్షులైన వారు సాధారణంగా ఓ కుక్క పిల్లను ముద్దుగా పెంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. మరి డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ చేరుకుని ఆరు నెలలు గడిచినా ఇంకా ఓ జంతువును చేరదీయలేదు. గత అధ్యక్షుడు ఒబామా పోర్చుగీసుకు చెందిన వాటర్ డాగ్ బోను పెంచుకున్నారు.
నేటి ఆధునిక కాలంలో అధ్యక్షులయ్యే వారిలో దాదాపు అందరూ పెంపుడు జంతువులు కలిగి ఉంటున్నారని ‘పెట్స్ ఎట్ వైట్ హౌస్’ పేరుతో ఓ పుస్తకం రచించిన జెన్నిఫర్ పికెన్స్ పేర్కొన్నారు. మరి డోనాల్ట్ ట్రంప్ పెంపుడు జంతువును తెచ్చుకునే ప్రణాళికలపై ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ అధికార ప్రతినిధి స్టీఫెనీ గ్రీషమ్ ను మీడియా ప్రశ్నించగా... ఇప్పటికైతే ఆ ప్రణాళికలు ఏవీ లేవని, అధ్యక్ష కుటుంబం ఇంకా కొత్త ప్రదేశంలో సర్దుకుపోయే క్రమంలో ఉందన్నారు. ఒకవేళ ట్రంప్ దంపతులు పెంపుడు జంతువు వద్దనుకుంటే కొత్త సంప్రదాయానికి నాంది పలికినట్టే అవుతుంది.