: హెచ్1బీ వీసాల జారీని తిరిగి ముమ్మరం చేయనున్న అమెరికా
ఉన్నత విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థల కోరిక మేరకు హెచ్1బీ వీసాల జారీని ముమ్మరం చేసే ప్రక్రియను పునః ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశయసాధనలో భాగంగా అమెరికాలో నివసించే ప్రవాసుల సంఖ్యను కట్టడి చేయడానికి ఏప్రిల్‌లో ఈ హెచ్1బీ వీసాల జారీని ముమ్మరం చేసే ప్రక్రియను 6 నెలల పాటు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో అక్కడి సంస్థల్లో పనిచేసే విదేశీయులు హెచ్1బీ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది.
ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని ఆయా సంస్థలు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రెంట్ సర్వీసెస్ వారికి మనవి చేసుకున్నాయి. వారి కోరిక మేరకు ఈ ప్రక్రియను పునః ప్రారంభించనున్నారు. దీని వల్ల హెచ్1బీ కోసం ఆరు నెలలు వేచి ఉండనక్కరలేదు. కేవలం దరఖాస్తు చేసుకున్న 15 రోజులకే హెచ్1బీ వీసాను పొందవచ్చు. ప్రస్తుతం సంవత్సరానికి 65,000 హెచ్1బీ వీసాలను అమెరికా జారీ చేస్తోంది. అలాగే డిగ్రీ ముందుగా పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా 20,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తోంది. ఈ వీసాను అమెరికా కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు జారీ చేస్తాయి.