: నాకింకా పెళ్లి కాలేదు...ఇక్కడ నాకెవరూ లేరు... కేసులో నన్ను ఇరికిస్తారేమోనన్న భయం వేస్తోంది: పిటిషన్ లో వాపోయిన ఛార్మీ
తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారిస్తున్న డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ప్రమాదం ఉందంటూ సినీ నటి చార్మి కౌర్ అలియాస్ సర్ దీప్ కౌర్ నిన్న లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. అయితే దీనిని వెంటనే విచారణకు స్వీకరించేందుకు నిరాకరించిన న్యాయస్థానం రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో రెగ్యులర్ పిటిషన్ ను ఛార్మీ తన న్యాయవాది విష్ణువర్థన్ రెడ్డి ద్వారా దాఖలు చేయించారు.
ఈ పిటిషన్ లో ఛార్మీ ముంబైలో జన్మించిన తాను 15 ఏళ్ల వయసులో ‘నీ తోడు కావాలి’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించానని, రెండు నంది అవార్డులు కూడా అందుకున్నానని తెలిపారు. దీంతో సినీ పరిశ్రమలో తనకు వస్తున్న గుర్తింపును జీర్ణించుకోలేకపోయిన ఒక వర్గం తనపై లేనిపోని నిందలు, ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు తమ సర్క్యులేషన్ పెంచుకునేందుకు, వివిధ టీవీ చానళ్లు తమ టీఆర్‌పీ రేటింగ్ పెంచుకునేందుకు లేనిపోని కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. తాను ఒంటరి మహిళనని, తన తల్లిదండ్రులు తనతో ఉండరని, తనకు సహకరించే స్నేహితులు కూడా హైదరాబాదులో లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 (1) కింద న్యాయవాది ద్వారా సహాయం పొందే హక్కును కల్పించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించే ప్రశ్నలు వేసి, ఒత్తిడికి గురిచేసి, చేయని నేరాన్ని అంగీకరింపచేస్తారని ఆందోళన చెందుతున్నానని, తనకు ఇంకా వివాహం కాకపోవడంతో తనపై అభాండాలు వేస్తే తన భవిష్యత్, కెరీర్ పై అవి తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే తనను భయపెట్టకుండా, ఒత్తిడి చేయకుండా విచారించాలని, మహిళా అధికారులే తనను విచారించాలని, విచారణ సమయంలో తన లాయర్ ను అనుమతించాలని ఆమె హైకోర్టును కోరారు.
అలాగే తన రక్తం, తల వెంట్రుకలు, కాలి వేలి గోళ్లు ఇవ్వాలని కోరకూడదని ఆమె కోరారు. ఈ పిటిషన్ లో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్, సూపరింటెండెంట్ (సిట్) లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో డీజీపీతో ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సమావేశమయ్యారు. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. నేడు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో గతంలో విచారించిన వారి వీడియో పుటేజ్ ను న్యాయస్థానానికి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయనుందోనని అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.