: గాంధీ ఆసుపత్రిలో మృత్యుంజయ హోమం... సైన్సా? మూఢనమ్మకమా?
మూఢనమ్మకాలు మంచిది కాదని చెప్పే వైద్యులు గాంధీ ఆసుపత్రిలో మృత్యుంజయ హోమం నిర్వహించడం వివాదాస్పదమైంది. హైదరాబాదు, గాంధీ ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులో ఈ మధ్య కాలంలో తల్లీపిల్లల మరణాలకు వాస్తు దోషమే కారణమని, మృత్యుంజయ హోమం నిర్వహించడం ద్వారా ఆ దోషాన్ని సవరించవచ్చని ఒక వ్యక్తి సలహా ఇచ్చారట. దీంతో వైద్యులు సుమారు 4 గంటల పాటు గైనకాలజీ వార్డులో మృత్యుంజయ హోమం నిర్వహించారు.
కాగా, గాంధీ ఆసుపత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజూ సగటున 2,500 మంది రోగులు వస్తుంటారు. గైనకాలజీ విభాగంలో రోజూ సగటున 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. గాంధీ ఆసుపత్రికి వచ్చే కేసుల్లో అత్యధికం హైరిస్క్ కేసులే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో గర్భిణులు, పిల్లల మరణాలు పెరగిపోతున్నాయి. దీంతో ఒక వ్యక్తి సలహామేరకు గైనకాలజీ విభాగాధిపతి అనుపమ, మాజీ ఆర్‌ఎంవో ప్రమీలతోపాటు వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది మృత్యుంజయ హోమం నిర్వహించడం విశేషం.