: ట్రంప్ బుర్రలేని బిలియనీర్.. అభివర్ణించిన ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్.. వీడియో విడుదల!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బుర్రలేని బిలియనీర్’ అని సోమాలియాకు చెందిన ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ సంస్థ అభివర్ణించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. అల్-షబాబ్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా ఓటర్లు ఓ స్టుపిడ్ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చని వీడియోలో పేర్కొంది. అమెరికాను గొప్పగా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ ఈ భూమ్మీదే అతిపెద్ద జోక్ పేల్చారని ఎద్దేవా చేసింది.
ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన అల్-షబాబ్‌పై మిలటరీ ఆపరేషన్స్‌కు ట్రంప్ అనుమతి ఇచ్చారు. దీంతో ఆ సంస్థపై వాయుదాడులకు అవకాశం ఏర్పడింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో సోమాలియా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ను బుర్రలేని నాయకుడంటూ అల్-షబాబ్ ఈ వీడియోను విడుదల చేసింది.