: విశాఖపట్టణం మాది, దీని పరువు కాపాడాల్సిన బాధ్యతా మాదే!: వైసీపీ నేత బొత్స
విశాఖపట్టణం మాది, దీని పరువు కాపాడాల్సిన బాధ్యతా మాదేనంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన ప్రజాజీవితంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, భూములను ఎవరికీ కట్టబెట్టలేదని అన్నారు. దోపిడీదారుల నుంచి విశాఖపట్టణాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. రుషికొండ వద్ద ఉన్న ఓ క్రిస్టియన్ ట్రస్ట్ కు కొన్ని ఎకరాలను క్విడ్ ప్రో పద్ధతిలో కట్టబెట్టారనే ఆరోపణలపై బొత్స స్పందిస్తూ, అదంతా అబద్ధమని కొట్టిపారేశారు. ‘దస్పల్లా స్కామ్ లో మీ పాత్ర ఉందని, ఏడు ప్లాట్లు అడిగారని ఆరోపణలు వస్తున్నాయి’ అని ప్రశ్నించగా, బొత్స స్పందిస్తూ, ‘నేను అడిగానని చెబుతున్న వాళ్లెవరో జనం ముందు చెబితే, అప్పుడు తెలుస్తుంది..చెప్పుతీసుకుని కొట్టేస్తారు’అంటూ మండిపడ్డారు.