: యుద్ధం వస్తే కనుక.. భారత్‌కు ఏ దేశ మద్దతూ వుండదు!: శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే
పొరుగు దేశాలతో వివాదం వస్తే భారత్‌కు మద్దతు తెలపడానికి ప్రపంచంలో ఏ దేశం ముందుకు రాదని, దీనంతటికీ మోదీ కేంద్రీకృత విధానాలే కారణమని శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అంతర్జాతీయ పర్యటనల పేరుతో విదేశాలు తిరిగి, అధినేతల మనసు గెల్చుకున్నా, నిజమైన యుద్ధ సమయంలో వారెవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రారని ఉద్ధవ్ హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్‌లతో వివాదాల కన్నా మోదీకి దేశంలోని శివసేన పార్టీతో ఉన్న వివాదమే పెద్దగా కనిపిస్తోందని ఉద్ధవ్ అన్నారు.
దేశంలో రాజకీయంగా ఎదగడం కోసం, పొరుగు దేశాలతో ఉన్న వివాదాలపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దీని వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆయన గుర్తు చేశారు. చైనా బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, వీలైనంత త్వరగా వివాదం సద్దుమణిగేలా చూడాలని ఉద్ధవ్ ప్రధానికి హితబోధ చేశారు. భారత్‌కు వచ్చే ప్రమాదాలు పట్టించుకోకుండా అధికార పక్షం ఇలా ఎన్నికలు, రాజకీయాలు అంటూ కాలం వెళ్లబుచ్చడం సబబు కాదని ఆయన తెలిపారు.
`ఎన్నికలు ఎప్పుడైనా గెలవొచ్చు. మీరు ఇప్పటికే గెలిచారు కూడా. యుద్ధం అలా కాదు. అందులోనూ యుద్ధం చైనాతో అని గుర్తుపెట్టుకోండి. మరోపక్క పాకిస్థాన్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తోంది. రెండు దేశాలతో మనం ఒకేసారి పోరాడలేం` అని ఉద్ధవ్ థాక్రే గుర్తుచేశారు. అలాగే నోట్ల రద్దు, జీఎస్‌టీ గురించి మాట్లాడుతూ `సంస్కరణలు మంచివే. కాకపోతే ఒకదాని అమలు, పనితీరు విశ్లేషించుకున్నాక ఇంకొకటి ప్రవేశపెట్టాలి. ఇలా మంచి పేరు కోసం వరుసగా సంస్కరణలు చేసుకుంటూ పోవద్దు. దీని వల్ల పత్రికా ప్రకటనల్లో ప్రగతి కనిపిస్తుంది తప్ప వాస్తవ ప్రగతి శూన్యం` అని అన్నారు.