: అమరావతిలోని కాల్ సెంటర్ లో కలుషితాహారం... హుటాహుటిన ఆసుపత్రికి ఐదుగురు ఉద్యోగులు
అమరావతి సమీపంలోని ఓ కాల్ సెంటర్ లో కలుషితాహారం తిని ఉద్యోగులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్న ఓ కాల్ సెంటర్ లో ఈ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఐదుగురు ఉద్యోగులు వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. విషయం తెలుసుకున్న కాల్ సెంటర్ యాజమాన్యం వారిని హుటాహుటిన సమీపంలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వారందరికీ చికిత్స నిర్వహిస్తున్నామని ప్రాణాపాయం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. వారికి అందించిన ఆహారం శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.