: 'నిథారీ కిల్లింగ్స్' కేసు: పింకీ సర్కార్ హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష!


సంచలనం సృష్టించిన 'నిథారీ కిల్లింగ్స్' కేసులో పింకీ సర్కార్ ను హత్య చేశారన్న ఆరోపణలు వాస్తవమని తేల్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాపారవేత్త మొనీందర్ సింగ్ పాంధర్, అతని ఇంట్లో పనిమనిషి సురీందర్ కోలీలకు మరణదండన విధిస్తూ కొద్దిసేపటిక్రితం తీర్పును వెలువరించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి పవన్ కుమార్ తివారీ, క్రూరాతి క్రూరంగా హత్య చేసిన ఇద్దరు నిందితులూ జీవించే అర్హతను కోల్పోయారని వ్యాఖ్యానించారు.

 యువతిని కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారం, హత్య ఆరోపణలన్నీ వీరిపై రుజువయ్యాయని తెలిపారు. కాగా, డిసెంబర్ 29, 2006న నోయిడా సమీపంలోని నిథారీ వద్ద పాందర్ ఇంట్లో 19 అస్థి పంజరాలు బయటపడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు 19 కేసులను నమోదు చేయగా, వాటిల్లో 16 కేసుల్లో సాక్ష్యాలు లేక వాటన్నింటినీ నిందితులపై కొట్టేయాల్సి వచ్చింది. 19 అస్థి పంజరాల్లో అత్యధికం, ఆ ప్రాంతంలో అదృశ్యమైన యువతులవే కావడంతో, పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పింకీ సర్కార్ కేసులో పక్కా సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. కాగా, కేసు విచారణ 11 సంవత్సరాల పాటు సాగడం గమనార్హం.

  • Loading...

More Telugu News