: రోడ్డుపై గుంతను తప్పించబోయి, లారీ కిందపడి మరణించిన సెలబ్రిటీ మహిళా బైకర్ జాగృతీ విరాజ్
కేవలం మహిళలకు మాత్రమే నిర్దేశించిన 'ఉమెన్ ఓన్లీ బైకర్స్ క్లబ్' మెంబర్, తన వీడియోలతో రహదారి ప్రమాదాలపై ఎంతో అవగాహన కల్పించిన జాగృతీ విరాజ్ హోగాలే జీవితం, తను వాడే బైక్ పైనే విషాదాంతమైంది. ముంబై హైవేపై, ఓ గుంతను తప్పించబోయిన ఆమె, పక్కనే వస్తున్న లారీ కిందపడి దుర్మరణం పాలైంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, 34 ఏళ్ల హోగాలే, నిన్న తన స్నేహితులతో కలసి బాంద్రా నుంచి బయలుదేరి వాటర్ ఫాల్స్ ఉన్న జవహర్ ప్రాంతానికి బయలుదేరింది.
ఆ సమయంలో భారీగా వర్షం పడుతోంది. ముందు వెళుతున్న ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేసే ఉద్దేశంతో, వెళుతున్న ఆమె, నీటితో నిండిన ఓ గుంతను గమనించలేదు. బైక్ ఆ గుంతలో పడి అదుపు తప్పగా, ట్రక్ వెనుక చక్రాలు, ఆమె పైనుంచి వెళ్లాయి. వెనకే వస్తున్న స్నేహితులు వచ్చి చూసేసరికి ఆమె ప్రాణాలు పోయాయి. హోగాలే మరణంతో ముంబైలో రోడ్లపై గుంతల విషయంలో విపక్షాలు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. శివసేన సైతం ప్రభుత్వ వైఫల్యంపై మండిపడింది.