: జమ్మూ కాశ్మీర్ డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్
జూన్ 22, 2017న జమ్మూ కాశ్మీర్‌లో డీఎస్పీ అయూబ్ పండిత్‌ను రాళ్లతో కొట్టి చంపడంలో కీలక పాత్ర వహించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సాజిద్ అహ్మద్ గిల్కర్ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు ఐజీపీ మునీర్ ఖాన్ మీడియాకు తెలియజేశారు. గిల్కర్‌తో పాటు మరో నలుగురు అయూబ్ పండిత్‌ను కొట్టి చంపినట్లు విచారణలో తేలిందని మునీర్ ఖాన్ వివరించారు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు జాకీర్ ముసాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు మసీదు నుంచి బయటకు వస్తున్న సమయంలో గిల్కర్ బృందం అయూబ్‌పై దాడికి పాల్పడిందని ఖాన్ చెప్పారు. గతంలో సీఆర్‌పీఎఫ్ పోలీసులపై జరిగిన గ్రెనేడ్ దాడుల్లో కూడా గిల్కర్ హస్తముందని ఖాన్ తెలిపారు. గిల్కర్‌తో పాటు అతని సహచరులు ఆఖీబ్ గుల్, జావేద్ అహ్మద్ షేక్‌లు కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ఖాన్ స్పష్టం చేశారు.