: సుష్మాస్వరాజ్‌పై హక్కుల తీర్మానం సిద్ధం చేస్తున్న ప్రతిపక్షం!
2014లో ఇరాక్‌లో ఆచూకీ తెలియకుండా పోయిన 39 మంది భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వారి కుటుంబాలకు పార్లమెంట్ సాక్షిగా ఆమె ఇచ్చిన భరోసాను వట్టి మాటలుగా ప్రకటిస్తూ బాధితుల తరఫున సుష్మా స్వరాజ్‌పై పార్లమెంట్‌లో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. కిడ్నాప్‌కు గురైన భారతీయుల విషయంలో భారత దేశాన్ని, పార్లమెంట్‌ను, బాధితుల కుటుంబాలను సుష్మా తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 39 మంది భారతీయులు మోసుల్‌లోని జైల్లో సురక్షితంగా ఉన్నారని చెప్పి భారత ప్రజల విశ్వాసాన్ని సుష్మా కోల్పోయారని ప్రతిపక్షం ప్రతినిధి పర్తాప్ సింగ్ భజ్వా అన్నారు.
మోసుల్ ప్రాంత ఆక్రమణలో భాగంగా 2014లో ఐసిస్ వీరిని అపహరించింది. ఇరాకీ విదేశాంగ ప్రతినిధుల సమాచారం ప్రకారం వారంతా బదూష్ ప్రాంతంలో క్షేమంగా ఉన్నారని సుష్మ ప్రకటించింది. ఇటీవల భారత్ వచ్చిన మరో ఇరాక్ ప్రతినిధి వారి యోగక్షేమాల సంగతి తెలియదని ప్రకటించడం ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అలాగే మోసుల్ ఆక్రమణ సమయంలో తీవ్రవాదుల నుంచి తప్పించుకుని వచ్చిన భారతీయుడు హర్జిత్ మసీ చెబుతూ, తన కళ్ల ముందే భారతీయులందరినీ ఉగ్రవాదులు ఊచకోతకోసి చంపేశారని చెప్పాడు.