: డ్రగ్స్ గురించి మాట్లాడితే చెడ్డ పేరు వస్తుందంటున్నారు.. మరి డ్రగ్స్ ను ఎందుకు అరికట్టలేదు?: డీకే ఆరుణ
డ్రగ్స్ మీద ఎవరైనా మాట్లాడితే... 'ఎవరూ అలా మాట్లాడవద్దు. హైదరాబాదుకు చెడ్డ పేరువస్తోంది' అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారని కాంగ్రెస్ నేత డీకే ఆరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో ఆమె మాట్లాడుతూ, చెడ్డపేరు రాకుండా అధికార పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను పట్టుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. మీరేం చేసినా తెలంగాణ, హైదరాబాదు సంస్కృతిని నాశనం చేసేవరకు మౌనంగా ఉండాలా? అని ఆమె ప్రశ్నించారు.
స్కూల్ పిల్లలకు డ్రగ్స్ గురించి ఏం తెలుస్తుందని ఆమె అడిగారు. అలాంటి పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ డ్రగ్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలి పెట్టవద్దని ఆమె స్పష్టం చేశారు. డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిస్తే హైదరాబాదుకు మంచి పేరు వస్తుందని ఆమె తెలిపారు.