: ఆ నలుగురూ ఒక ఎత్తు... నవదీప్ ఒక ఎత్తు... అత్యంత కీలకుడంటున్న సిట్!
టాలీవుడ్ డ్రగ్స్ దందాపై విచారణ ఐదో రోజుకు చేరుకున్న వేళ, నేడు విచారిస్తున్న నవదీప్ మొత్తం కేసులో అత్యంత కీలకుడని సిట్ వర్గాలు చెబుతున్నాయి. తొలి నాలుగు రోజుల విచారణ ఒక ఎత్తు అయితే, నేడు నవదీప్ విచారణ అంతకన్నా ఎక్కువేనని, ఆయన నుంచి కీలక సమాధానాలు రాబట్టేందుకు అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేశారని సిట్ అధికారులు వెల్లడించారు. పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ ల విచారణ పూర్తి కాగా, వీరిలో శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుల నుంచి లభించిన సమాచారం సిట్ కు పెద్దగా ఉపకరించలేదని తెలుస్తోంది.
ఇక పూరీ ప్రత్యక్షంగా డ్రగ్స్ వ్యాపారంలో లేకున్నా, తాను కొనుగోలు చేసి ఇతరులకు అందించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. శ్యామ్ కే నాయుడి ఖాతా నుంచి కెల్విన్ కు డబ్బు వెళ్లడం మినహా, అతనిపై డ్రగ్స్ వాడాడన్న ఆరోపణలు కూడా లేవు. శనివారం నాడు తరుణ్ ను విచారించిన సమయంలో మాత్రం డ్రగ్స్ సరఫరా జరుగుతున్న పబ్బుల విషయంలో లోతైన విచారణ జరిగింది. ఇక నేడు విచారణను ఎదుర్కొంటున్న నవదీప్ కు కొన్ని పబ్బుల్లో వాటాలు ఉండటం, కెల్విన్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు, వాట్స్ యాప్, ఫోన్ కాల్స్ వివరాలను సేకరించిన సిట్, వాటన్నింటినీ చూపుతూ నవదీప్ ను ప్రశ్నించనుంది. తరుణ్ లాగానే, నవదీప్ ను సైతం సుదీర్ఘంగా అధికారులు విచారించవచ్చని సమాచారం.