: పదండి మెరీనా బీచ్ కు... తమిళ యువత కదులుతోందన్న అనుమానంతో పోలీసుల ఉరుకులు, పరుగులు!
తమిళ యువత ఒకసారి కదిలితే, ఎంతటి ఐకమత్యంతో, సంఘటితంగా ఉద్యమిస్తుందో, మెరీనా బీచ్ వేదికగా సాగిన జల్లికట్టు ఉద్యమం నిరూపించింది. ఇక రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, కదిరామంగళం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా మెరీనా బీచ్ కి తరలి రావాలంటూ ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో మెసేజ్ లు భారీ ఎత్తున ఫార్వార్డ్ అవుతుండటంతో, పోలీసులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
శనివారం రాత్రి నుంచి వేల సంఖ్యలో సందేశాలు షేర్, ఫార్వార్డ్ కాగా, దీన్ని గుర్తించిన ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలతో మెరీనా బీచ్ వద్ద భద్రతను మరింతగా పెంచారు. ఆదివారం ఉదయం నుంచి సముద్ర తీరానికి వస్తున్న కుటుంబాలను ఆపి, వారి వివరాలు తీసుకుని, అనుమానం రాకుంటేనే బీచ్ లోకి అనుమతించారు. ఇక పది మంది స్నేహితులు కనిపిస్తే, వారిని అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా, బీచ్ లోకి పెద్ద ఎత్తున యువత రానుందని వచ్చిన హెచ్చరికలతో బీచ్ మొత్తాన్ని జల్లెడపడుతూ నిఘాను తీవ్రతరం చేశారు.