: ఆన్ లైన్ లో పరిచయమైన అమ్మాయి కొంప ముంచింది... రెండు రోజుల్లో 34 సార్లు డబ్బు పంపిన యువకుడు!


తనకు ఆన్ లైన్లో పరిచయం అయిన అమ్మాయి డబ్బు కావాలని అడుగుతుంటే, రెండు రోజుల వ్యవధిలో తండ్రి బ్యాంకు కార్డు తీసుకుని 34 సార్లు డబ్బులు పంపిన యువకుడి ఉదంతం ఇది. విషయం తెలుసుకున్న అతని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. విశాఖ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రైల్వే శాఖలో పని చేసిన సుభాశ్ చంద్రదాస్, ఇటీవల పదవీ విరమణ చేయగా, రూ. 40 లక్షల నగదు అందింది. కొంత మొత్తాన్ని అవసరాల నిమిత్తం వాడుకుని, ఆపై మిగిలిన మొత్తాన్ని ఎస్బీఐ ఖాతాలో జమ చేసుకున్నాడు.

ఆయనకు 17 ఏళ్ల కొడుకు ఉండగా, ఇటీవల కోల్ కతాకు చెందిన ఓ యువతి అతనికి పరిచయం అయింది. ఆమె తన ఫోన్ నంబర్ కూడా ఇవ్వడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో 20వ తేదీన ఆమె ఫోన్ చేసి అత్యవసరమని చెప్పి రూ. 40 వేలు కావాలని అడిగింది. తండ్రి ఇంట్లో లేని సమయంలో ఏటీఎం కార్డును తీసుకెళ్లి, కోల్ కతా ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆపై మరో రూ. 40 వేలు కావాలని అడిగింది. ఆ డబ్బులు కూడా వేశాడు. ఇలా రెండు రోజుల వ్యవధిలో, అమ్మాయి అడుగుతూ ఉంది, మనవాడు వేస్తూనే ఉన్నాడు.

మొత్తం 34 లావాదేవీలు జరుగగా, రూ. 13,29,800 పంపాడు. ఏ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన సమాచారం చంద్రదాస్ కు రాలేదు. 21వ తేదీ రాత్రి మాత్రం నగదు ఉపసంహరణకు సంబంధించిన మెసేజ్ రాగా, చూసుకుని, తన ఖాతాలో డబ్బు పోయిందని పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎం ద్వారా సీడీఎం (క్యాష్ డిపాజిట్ మెషీన్) నుంచి డబ్బులు బట్వాడా అయినట్టు గుర్తించిన పోలీసులు, కుటుంబ సభ్యులనే తొలుత అనుమానించి విచారించగా, విషయం తెలిసిందే. ఇక ఆ అమ్మాయి వెనుక ఏదైనా సైబర్ నేరగాళ్ల ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News