: డ్రోన్లు, బాడీ కెమెరాలు... ముద్రగడను అడ్డుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్న ఏపీ పోలీసులు


కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఈ నెల 26 నుంచి చలో అమరావతి పేరిట ముద్రగడ పాదయాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఎల్లుండి కిర్లంపూడి నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి వుండగా, ఊరు మొత్తాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకున్న పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రతి వీధిపై నిఘా పెట్టారు. ఎవరు బయటకు వస్తున్నారు? ఎవరు ఎక్కడికి పోతున్నారు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? వంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు.

ఇక్కడ కాపలా కాస్తున్న పోలీసులు బాడీ కెమెరాలను ధరించి తిరుగుతూ, అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాపు వర్గం నేతలపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీసులు, ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నెల 26 వరకూ 144 సెక్షన్ విధించిన పోలీసులు, ఏ నలుగురూ కూడా కలసి నడిచేందుకు కూడా అనుమతించడం లేదు. కిర్లంపూడికి దారితీసే అన్ని మార్గాలనూ మూసేసిన పోలీసులు, గుర్తింపు కార్డులను చూపిన వారిని మాత్రమే ఊరిలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన పాదయాత్ర జరిగి తీరుతుందని ముద్రగడ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News